నోవెల్ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, అధికారులు వీడియోలింక్ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. కరోనా అప్రమత్తతపై మోదీ సమీక్ష నిర్వహించారు.
వివిధ రాష్ట్రాలు ఏ విధంగా సంసిద్ధంగా ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలను మోదీ సూచించారు. లోకల్ ట్రాన్స్‌మిషన్‌ను అడ్డుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళనిస్వామి, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్, కేరళ సీఎం విజయన్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్లు పాల్గొన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.